సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మూడు నెలల పాటు విశ్రాంతిలో ఉండనున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా అంటూ ప్రకటించినప్పటికీ, సృజనాత్మక వ్యత్యాసాల కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి సరైన కారణాలు అయితే తెలియవు కానీ, సినిమా అయితే పక్కాగా ఆగిపోయిందనే సమాచారం మాత్రం తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది సరే నెక్ట్స్ మహేష్ బాబు చేయబోయే సినిమా ఏంటి? ఏ డైరెక్టర్‌తో చేయబోతున్నాడు? అనే దానిపై ఇప్పుడు ఆయన అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ఆయన తన తదుపరి సినిమా విషయమై నిర్ణయం తీసుకోవడానికి ఇంకొంత టైమ్ తీసుకోవాలని అనుకుంటున్నారు. మరో మూడు నెలల పాటు విశ్రాంతిలోనే ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. అసలైతే ఆయన ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ తర్వాత హిమాలయాలకు వెళ్లి రావాలని భావించారు. కానీ కరోనా కలకలంతో ఇప్పుడు బయటికి వెళ్లే పరిస్థితులు లేవు కాబట్టి.. ఫ్యామిలీతో తన ఫామ్ హౌస్‌లోనే ఈ మూడు నెలలు ఉండాలని మహేష్ భావిస్తున్నారు. ఈ టైమ్‌లో తన అభిమానులు నిరాశ చెందకుండా ఉండేందుకు సోషల్ మీడియాలో మహేష్ యాక్టివ్‌గానే ఉన్నారు. వరుస ట్వీట్స్‌తో అభిమానులకు, ప్రజలకు కరోనా వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మహేష్ తెలియజేస్తున్నారు.