ఆటకు అందం వీడ్కోలు

ఆటకు ఆట. అందానికి అందం. భువి నుంచి దివికి దిగివచ్చిన దేవకన్యలా ముట్టుకుంటే కందిపోయే పాలరాతి శిల్పం లాంటి మేను.అందంతోనే కాదు తనదైన ఆటతీరుతో టెన్నిస్‌ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన రష్యా భామ మరియా షరపోవా అభిమానులను ఆశ్చర్యంలో పడేసింది. అవును తానేంతో అభిమానించే టెన్నిస్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలికింది. టీనేజ్‌లోనే సంచలనాలు సృష్టించిన షరపోవా టెన్నిస్‌కు ఇక గుడ్‌బై అంటూ సంక్షిప్త సందేశంతో తన నిర్ణయాన్ని ప్రకటించింది. కెరీర్‌లో డోపింగ్‌ మరకగా నిలిచినా..అందమైన ఆటతో కోట్లాది మంది హృదయాలను మరియా కొల్లగొట్టింది. కోర్టులో దిక్కులు పిక్కటిల్లేలా అరిచే ఈ అందాల భామ ఐదు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లకు తోడు మరెన్నో ట్రోఫీలు సొంతం చేసుకుంది. టెన్నిస్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న షరపోవా ఆటపై చెరగని ముద్రవేసిందనే చెప్పాలి.